‘అంతా’ పులకించే.. | Sakshi
Sakshi News home page

‘అంతా’ పులకించే..

Published Sun, Jul 31 2016 11:32 PM

భద్రాచలంలో గోదావరిలో స్నానమాచరిస్తున్న భక్తులు

భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు

  •  తొలి రోజు 30 వేలమంది పుణ్యస్నానాలు
  • భక్తుల జయజయధ్వానాలతో మార్మోగిన తీరం
  • ప్రవిత్ర స్నానం, రామయ్య దర్శనంతో పునీతం
  • పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి
  • గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీ హారతి


గోదావరి తీరం పులకించింది. భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఊరేగింపు, పూజలు, పుణ్యస్నానాలతో సందడిగా మారింది. భద్రాద్రిలో గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమైన వేళ.. వేలాది మంది భక్తులు జై శ్రీరామ్‌ అంటూ పుష్కరస్నానమాచరించారు. పిండప్రదానాలు చేసి.. పితృతర్పణాలు వదిలారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు.. భక్తజనం తోడు రాగా.. సుందరంగా అలంకరించిన లాంచీపై స్వామివారిని ఆశీనుల చేశారు. ఆదివారం ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కర వేడుక 11వ తేదీతో ముగుస్తుంది. వేలాది భక్తుల పుణ్యస్నానాలతో గౌతమి తీరం శోభాయమానంగా కనిపించింది. సాయంత్రం నదీ హారతితో మరింతగా కాంతులీనింది.

భద్రాచలం :  
    భద్రాచలంలో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కర ఘడియలు సమీపించగానే గోదావరి తీరం రామనామ స్మరణతో మార్మోగింది. పవిత్ర స్నానం ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో తీరం జన సందోహంగా మారింది. భద్రాద్రి ఆలయం నుంచి శ్రీసీతారామచంద్రస్వామివారి ప్రచార మూర్తులు, చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజాచార్య స్వామి వారులతో ఊరేగింపుగా  వెళ్లారు.  మెట్లరేవు వద్ద ఉన్న గోదావరి మాత విగ్రహానికి ఈఓ రమేష్‌బాబు పూజలు చేసి, నూతన వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ, దేవస్థానం ఆస్థానవిద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ.. భక్తజనం తోడుగా గోదావరి తీరానికి చేరుకున్నారు.  సుందరంగా అలంకరించిన లాంచీపై అన్నింటినీ ఆశీనుల చేశారు.

  • శ్రీరామానుజాస్వామివారికి అభిషేకం.. ఆపై పుష్కరస్నానం

 శ్రీరామానుజాచార్యస్వామి వారికి అభిషేక కార్యక్రమంలో భాగంగా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. గోదావరి అంత్య పుష్కరాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. శ్రీరామానుజాచార్యస్వామి వారికి గోదావరి జలాలతో అభిషేకం జరిపారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, దుస్తులు సమర్చించారు. మంగళ హారతులు ఇచ్చారు. శ్రీపాదుకలతో అర్చకులు, వేద పండితులు, భక్తజనం తోడుగా సామూహికంగా పుష్కర స్నానమాచరించారు. ఆ సమయాన గోదావరి తీరంలో ఉన్న భక్తులంతా జై శ్రీరామ్‌ అంటూ పుష్కర స్నానం చేశారు. భక్తులు  గోదావరి ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతులు ఇచ్చి దీపాలను వదిలారు.

  • పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామి

 గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో శ్రీసీతారాముల వారి ప్రచార మూర్తులను ఉంచారు. అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజార్యులను పునర్వసు మండపానికి తీసుకొచ్చి కొద్ది సేపు ఆశీనుల చేశారు. పునర్వసు మండపంలో ఉంచిన స్వామివారి మూర్తులకు స్నపన తిరుమంజనం గావించి.. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంత్య పుష్కరాలకు వచ్చి రామాలయాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగి వెళ్లే భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశారు.

  • గోదావరి తీరంలో భక్తజన సందడి

అంత్యపుష్కరాల మొదటి రోజు ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేశారు. నదిలో పసుపు, కుంకుమ, దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. పుష్కరాల ప్రారంభంతో గోదావరిలో  పుణ్య స్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 11 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి ఘాట్‌లో ఎటువంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లు, ఫైర్‌ సిబ్బందితో పాటు పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

  • పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి

అంత్య పుష్కరాల్లో పాల్గొనేందుకు భద్రాచలం వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్‌ పుణ్యస్నానమాచరించారు. ఆయనతో పాటు జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బులికృష్ణ ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హనుమంతు గోదావరికి పూజలు చేశారు. వారిని అర్చకులు ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బేగ్‌ తదితరులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇరిగేషన్‌ శాఖ ఈఈ ప్రసాద్,  భద్రాచలం సర్పంచ్‌ భూక్యా శ్వేత, తహశీల్దార్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • వైభవంగా నదీ హారతి

అంత్య పుష్కరాల్లో భాగంగా గోదారమ్మకు ఆదివారం రాత్రి వైభవంగా నదీ హారతి ఇచ్చారు. ఆలయం నుంచి ఊరేగింపుగా అర్చకులు, వేదపండిపతులు గోదావరి తీరానికి చేరుకున్నారు. లాంచీ ఎక్కి ఈఓ రమేష్‌బాబు గోదారమ్మకు పూజలు నిర్వమించారు. అనంతరం  శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement