రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ మండల యూత్ కన్వీనర్ మృతి చెందిన ఘటన పామర్రులో గురువారం చోటు చేసుకుంది.
పామర్రు, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ మండల యూత్ కన్వీనర్ మృతి చెందిన ఘటన పామర్రులో గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కురుమద్దాలికి చెందిన మద్దాలి అరవింద్(29) పామర్రులో టీవీ మెకానిక్ షాపుని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి పల్సర్ బైక్ పై కురుమద్దాలి ఇంటికి వెళ్లి పామర్రు వస్తున్నారు.
చైతన్య ఆయిల్ మిల్ వద్ద ఎదురుగా పామర్రు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో పాటు బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో అరవింద్ అక్కడి కక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో బైక్ కాలిపోయింది. మృతుడికి భార్య భార్గవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే మార్గంలో విజయవాడ వెళ్తున్న వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ తాతినేని పద్మావతిలు ఘోరాన్ని చూసి చలించిపోయారు.