సమష్టి కృషి ఫలితమే 2014లో ఐదు విజయాలు | Five wins in 2014 was the result of the collective efforts | Sakshi
Sakshi News home page

సమష్టి కృషి ఫలితమే 2014లో ఐదు విజయాలు

Jan 27 2015 1:39 AM | Updated on Sep 2 2017 8:18 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2014లో గతంలో ఎన్నడూ లేని విధంగా సమష్టి కృషితో ఐదు ప్రయోగాలు చేసి విజయాలను సాధించగలిగామని...

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2014లో గతంలో ఎన్నడూ లేని విధంగా సమష్టి కృషితో ఐదు ప్రయోగాలు చేసి విజయాలను సాధించగలిగామని షార్ డెరైక్టర్ డాక్టర్ పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం మైదానంలో సోమవారం 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షార్ డెరైక్టర్  మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల ఇన్‌చార్జి  కమాండెంట్ ధనంజయ శుక్లా ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి సైనిక వందనాన్ని సమర్పించారు.

ఈ కవాతులో ప్రతిభ కనపరిచిన భద్రతా సిబ్బందికి జ్ఞాపికలను అందించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ  షార్ చరిత్రలో 2014 సంవత్సరం మరిచిపోలేనిదని చెప్పారు. మూడు పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు, ఒక జీఎస్‌ఎల్‌వీ రాకెట్, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాలతో అన్ని విజయాలను సాధిం చామని చెప్పారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల వల్ల మానవాళికి మంచి ఫలితాలను అందిస్తున్నందు కు గర్వ కారణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మానవాళికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

భవిష్యత్‌లో భారీ ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ, షార్ కేంద్రం రక్షణకు సంబంధించిన 30 మంది భద్రతా దళం కరాటే, మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ ప్రదర్శనలు ఇచ్చారు. అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు  ఆహుతులను ఎంతో అలరించాయి.
 
అన్ని కాలనీల్లో మువ్వన్నెల జెండా
కేఆర్‌పీ కాలనీ (పులికాట్ నగర్) స్కూల్లో షార్ అసోసియేట్ డెరైక్టర్ వీ శేషగిరిరావు, డీఓఎస్ కాలనీ (పినాకినీ నగర్) స్కూల్లో రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్ ఎస్‌వీ సుబ్బారావు, శ్రీహరికోట జిల్లా పరిషత్ హైస్కూల్లో డిప్యూటీ డెరైక్టర్ టీ సుబ్బారావు, శ్రీహరికోట ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ డెరైక్టర్ ఎంబీఎన్ మూర్తి, శబరికాలనీలో డాక్టర్ రబ్బాన్నీ  జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆట, పాటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వోలు పరచూరి విజయసారథి, విశ్వనాథశర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement