కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం పలువురు వైఎస్సార్ సీపీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌లో వాగ్దానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నట్లు అర్థం అవుతోందని అన్నారు. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇంత హడావుడి చేస్తున్నారంటే, ఇంతగా ప్రలోభాలకు దిగుతున్నారంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో ప్రజలందరికీ కనబడుతోందని మండిపడ్డారు.