
స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం సహకారనగర్/కొణిజర్ల: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సామగ్రి భద్రపర్చడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన భవనాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొణిజర్ల మండలంలోని గ్రేస్ కళాశాల, ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం పరిశీలించారు. చింతకాని, వైరా, కొణిజర్ల మండలాల బ్యాలెట్ బాక్సులను గ్రేస్ కళాశాలలో, సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాలకు సంబంధించి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్‌లో, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల బ్యాలెట్ బాక్సులను మహ్మదీయ కళాశాలలో భద్రపర్చేందుకు ఉన్న వసతులను పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు
ఖమ్మం సహకారనగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఈనెల 8వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. టెండర్ ఖరారైన నాలుగు రోజుల్లోగా ముద్రించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు అవసరమైన పేపర్లు తాము సమకూరుస్తామని చెప్పారు. ఆసక్తిఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ల యజ మానులు రూ.5వేల డీడీ చెల్లించి టెండర్ ఫారం తీసుకున్నాక పూర్తి వివరాలు, రూ.50 వేల డీడీతో ఈనెల 8లోగా సమర్పించాలని సూచించారు.