
టీజీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ‘కొంగర’
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవోస్) అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొంగర వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఖమ్మంలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా, జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కె.సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయగా, ఆ స్థానంలో ఖమ్మం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వర్లు నియామకాన్ని సభ్యులు ఆమోదించారు. అలాగే, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లెల రవీంద్రప్రసాద్(కారేపల్లి ఎంపీఓ)ను అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇక జిల్లా కోశాధికారి కొండపల్లి శేషుప్రసాద్‌ను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నందున ఆ స్థానంలో డాక్టర్ సూరంపల్లి రాంబాబు(అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ) నియమితులయ్యారు. ఈమేరకు నూతన అధ్యక్షుడిని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ, హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి.విజయ్‌కుమార్, నాయకులు రమేష్, పుష్పరాజ్, ఎం.సతీష్, అరుణకుమారి, గోపాలకృష్ణ, ఎన్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.