
అభివృద్ధి సరే... ఆగే రైళ్లు ఏవీ?
ఇకనైనా పునరుద్ధరించాలి
ఆంధ్రా నుంచి వస్తుంటాం..
● మధిర రైల్వేస్టేషన్ ద్వారా ఏటా రూ.5కోట్ల ఆదాయం ● అయినా పలు రైళ్లకు హాల్టింగ్ కరువు ● ఇబ్బందుల్లో ఏపీ – తెలంగాణ ప్రయాణికులు
మధిర: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది మధిర రైల్వేస్టేషన్ పరిస్థితి. ఈ రైల్వేస్టేషన్‌లో అవసరమైన రైళ్లను ఆపకుండా అభివృద్ధి చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా మధిర రైల్వేస్టేషన్‌ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. అవసరమైన రైళ్లకు హాల్టింగ్ లేకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
రోజూ 2వేల మంది రాకపోకలు
మధిర రైల్వేస్టేషన్ ద్వారా ప్రతిరోజు సుమారు 2,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన రైళ్లకు హాల్టింగ్ ఇవ్వకపోగా, గతంలో ఆగిన పలు రైళ్ల హాల్టింగ్ కూడా ఎత్తివేశారు. మధిర నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు పద్మావతి ఎక్స్‌ప్రెస్ సౌకర్యంగా ఉంటుంది. కానీ తిరుపతికి వెళ్లే మార్గంలో ఉన్నప్పటికీ తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ లేదు. దీంతో తిరుపతి వెళ్లిన భక్తులు విజయవాడకు వచ్చి అక్కడి నుంచి కోణార్క్ లేదా శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా మధిర చేరాల్సి వస్తోంది. ఈ క్రమాన గంటల తరబడి సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. అంతేకాక ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్(12655, 12656) రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రెండు రాష్ట్రాల సరిహద్దు
నియోజకవర్గ కేంద్రమైన మధిర తెలంగాణ – ఏపీ రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. దీంతో ఏపీ రాష్ట్రంలోని తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ప్రజలతోపాటు మధిర పరిసర ప్రాంత ప్రజలు ఈ రైల్వేస్టేషన్ నుంచే ప్రయాణిస్తుంటారు. వీరికి అవసరమైన రైళ్లకు హాల్టింగ్ లేకపోవడంతో అటు విజయవాడ లేదా ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. స్టేషన్ ద్వారా ఏటా సుమారు రూ.5కోట్ల ఆదాయం వస్తున్నా, ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా పదేళ్ల క్రితం నాటి రైళ్లు తప్ప కొత్తవి ఆగడం లేదు. ఈవిషయమై ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం కానరావడం లేదు. ఇకనైనా గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరించడంతో పాటు ఇంకొన్ని ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని.. తద్వారా ఆదాయం పెరిగి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని చెబుతున్నారు.
హాల్టింగ్ తొలగించిన రైళ్లు
కరోనా కంటే ముందు పలు ఎక్‌ప్రెస్ రైళ్లకు మధిర హాల్టింగ్ ఉండేది. ఇందులో గౌతమి ఎక్స్‌ప్రెస్(12737, 12738), సింహపురి ఎక్స్‌ప్రెస్ (12710, 12709), పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763), విశాఖపట్నం – మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ (12861), లక్నో ఎక్స్‌ప్రెస్ (16093, 16094)కు హాల్టింగ్ ఎత్తివేయడం గమనార్హం.
గతంలో మధిర స్టేషన్‌లో ఆగిన అన్ని రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరించాలి. తిరుపతికి వెళ్లే భక్తులు మధిర స్టేషన్‌కే వస్తుంటారు. వెళ్లడానికి పద్మావతి రైలు అందుబాటులో ఉన్నా తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ లేదు. దీంతో విజయవాడలో దిగి ఇబ్బంది పడాల్సి వస్తోంది. – పాలడుగు మురళి, మధిర
ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మధిర చేరుకుని విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా ప్రాంతాలకు వెళ్తుంటాం. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇస్తే ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. – పద్మనాభుని నవీన్, పెనుగొలను

అభివృద్ధి సరే... ఆగే రైళ్లు ఏవీ?

అభివృద్ధి సరే... ఆగే రైళ్లు ఏవీ?