
ఎల్‌ఆర్‌ఎస్ చకచకా..
ఫీజు చెల్లించిన దరఖాస్తులు సంఖ్య, ప్రొసీడింగ్స్
జారీ వివరాలు
● ఫీజులు చెల్లించిన దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ● కేఎంసీలో 51.7 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి ● సాంకేతిక, ఇతర కారణాలతో మిగతావి జాప్యం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కింద రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకుని.. నిర్దేశిత ఫీజు కూడా చెల్లించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా స్థలంపై యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడగా.. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపేలా గతేడాది ఫీజు కట్టించుకుంది. ఆతర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం జరగడంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతలోనే కలెక్టర్, కేఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీ చేయడాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కొద్దిరోజులుగా ప్రొసీడింగ్స్ జారీ ప్రక్రియ వేగవంతమైంది.
19,277 మంది ఫీజు చెల్లింపు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, ఎదులాపురం, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో లే ఔట్ రెగ్యులరైజేషన్ కోసం 19,277 మంది ఫీజు చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా రాయితీపై ఫీజు చెల్లించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా రకరకాల కారణాలతో జాప్యం జరిగింది. ఆపై దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్–1లో అర్బన్ ఏరియాలోని టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పత్రాలను పరిశీలిస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే ఎల్–2కు పంపిస్తున్నారు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌కు పైస్థాయి అధికారి పత్రాలను పరిశీలించి ఎల్–3 కి పంపుతున్నారు. అనంతరం అర్బన్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ దరఖాస్తులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్న దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు.
సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్య
జిల్లాలో కేఎంసీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 19,9277 మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించగా..
అత్యధికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 12,614 మంది ఫీజులు చెల్లించినా సిబ్బంది కొరతతో ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలతో పరిశీలన మరింత జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ దరఖాస్తుదారులు జత చేసిన పత్రాలు పూర్తి స్థాయిలో సైట్‌లో కనిపించక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అంతేకాక పరిశీలనలో మూడు శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాల్సి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కాస్త అటూఇటుగానైనా కలెక్టర్, కమిషనర్ చొరవతో ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీ అవుతుండడంతో దరఖాస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సంస్థ ఫీజు ప్రొసీడింగ్స్
చెల్లించింది జారీ అయినవి
ఖమ్మం కార్పొరేషన్ 12,614 6,523
సత్తుపల్లి మున్సిపాలిటీ 654 621
మధిర 1,101 979
ఏదులాపురం 3,3946 2,323
వైరా 725 535
కల్లూరు 237 110
మొత్తం 19,277 11,091