
అసైన్డ్ భూమి.. అమ్మేసెయ్!
దర్జాగా భూముల క్రయవిక్రయాలు
సరిహద్దు పట్టానంబర్ ఆధారంగా
బదలాయింపు
అధికారుల అండతో
అక్రమార్కుల లీలలు
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం రోజురోజుకు విస్తరిస్తుండడంతో భూములరకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ మాఫియా భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. సత్తుపల్లి రెవెన్యూ, అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూరికార్డుల ప్రక్షాళన సమయాన అసైన్డ్ భూములను పట్టా భూములుగా నమోదు చేసి అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి క్రయవిక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. ఈమేరకు ప్రొహిబేషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ 1970 చట్టం ప్రకారం అసైన్డ్ భూముల అమ్మితే విచారణ జరిపి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
సరిహద్దు పట్టా నంబర్లు వేసి...
అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూమికి సరిహద్దు పట్టా భూముల సర్వే నంబర్లు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకర్లపల్లి రోడ్డు, కల్పతరురోడ్డు వైపుకు వెళ్లే రహదారిలోని దళితుల కు అసైన్డ్ భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రాయించుకొని.. ఆపై ఖాళీ నివేశస్థలంగా మార్చి క్రయవిక్రయాలు జరిపినట్లు సమాచారం. సరిహద్దు వెంట గాడిదల వాగులో ముంపునకు గురైన పట్టా భూమి సర్వే నంబర్ల ఆధారంగా ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో అసైన్డ్ భూమిగా నమోదై ఉన్నా కుంటలుగా విభజించి రోడ్లు వేసి మరీ క్రయవిక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చాలంటే నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే అసైన్డ్ భూమిని ఇళ్ల స్థలాలుగా విక్రయించి పట్టా భూమి సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అలాగే, సత్తుపల్లిలోని కల్పతరు రోడు, మరో అసైన్డ్ భూమి విషయంలో ఇలా జరగగా.. భూమిని అధికార పార్టీ ప్రముఖుడికి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అధికారుల సహకారంతో..
అక్రమాల్లో అందరికీ వాటా ఉండడంతో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ల అండతో భూమి రికార్డులు మార్పులు చేసుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల సహకారంతో భూముల సర్వే నంబర్లు ఏమార్చి.. వీటిని నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. అసైన్డ్, ప్రభుత్వ భూములపై విచారణ జరిపిస్తే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఇక అవగాహన లేకుండా అసైన్డ్ భూములను కొన్న పలువురు ఇంటి అనుమతి, బ్యాంకు రుణాల సమయాన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. నిషేధిత, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై నిబంధనల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు. తాను విధుల్లో చేరాక అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టలేదని స్పష్టం చేశారు.