స్థానిక ఎన్నికల్లో పోటీపై పార్టీల్లో చర్చలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో పోటీపై పార్టీల్లో చర్చలు

Oct 8 2025 6:17 AM | Updated on Oct 8 2025 6:17 AM

స్థానిక ఎన్నికల్లో పోటీపై పార్టీల్లో చర్చలు

స్థానిక ఎన్నికల్లో పోటీపై పార్టీల్లో చర్చలు

● జట్టుగానా.. ఒంటరిగా పోటీ చేయాలా అని మీమాంస ● పరిస్థితులు అనుకూలించకపోతే పరస్పర అవగాహన ● కొన్ని చోట్ల ఆశావహుల నుంచి వ్యతిరేకత

వ్యూహాత్మక పొత్తులకే ఓటు

● జట్టుగానా.. ఒంటరిగా పోటీ చేయాలా అని మీమాంస ● పరిస్థితులు అనుకూలించకపోతే పరస్పర అవగాహన ● కొన్ని చోట్ల ఆశావహుల నుంచి వ్యతిరేకత

గత పరిస్థితుల ఆధారంగా..

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. అంతకుముందు 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఆతర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభావం చూపలేదు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గెలుపొందిన టీడీపీ.. స్థానిక సంస్థల మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరింది. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరిగినా ఒంటరిగానే బరిలోకి దిగాయి. కొందరు అభ్యర్థుల మధ్య స్థానికంగా అవగాహనతో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకరికి, ఎంపీటీసీ ఎన్నికల్లో మరొకరికి మద్దతు ఇచ్చారు.

కాంగ్రెస్‌లో భారీగా పోటీ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డుసభ్యులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ఇతర పార్టీలతో పోలిస్తే ఎన్నికల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా కాంగ్రెస్‌లోని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో ముగ్గురు నుంచి పది మంది వరకు టికెట్లు ఆశిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో పోటీ కొంత తక్కువగా ఉన్నా.. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాల్లో మాత్రం పోటీ ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడం, జిల్లాలో బలమైన కేడర్‌ కలిగి ఉన్న నేపథ్యాన పొత్తులకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు అంటూ కుదిరితే సీపీఐతోనే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం

2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆతర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మెరుగైన స్థానాలు దక్కాయి. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో 20 స్థానాలకు బీఆర్‌ఎస్‌ 17 స్థానాల్లో గెలవగా, 583 గ్రామపంచాయతీల్లో 351 స్థానాలు బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకున్నారు. అదే మాదిరి ఈసారి కూడా మంచి ఫలితాలు రాబట్టేలా బీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. అయితే, గతంలో మాదిరి బీఆర్‌ఎస్‌కు స్థానికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అన్న మీమాంస వెంటాడుతోంది. ఈ నేపథ్యాన పొత్తులతో బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై పార్టీలో చర్చ జరిగే అవకాశముంది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడమే మంచిదనే భావనతో ఉన్నట్లు సమాచారం. అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తుండగా.. బుధవారం ఖమ్మంలో జరిగే జిల్లా స్థాయి సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు.

లెఫ్ట్‌.. ఎటు రైట్‌?

సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఎటు వైపు వెళ్తాయన్నది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు ఎవరికి వారు తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నా చివరకు ఎవరితో జత కడతారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో స్థానికంగా బలోపేతం కావాలన్న వ్యూహరచనలో లెఫ్ట్‌ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో.. వామపక్షాల్లో ఏ పార్టీలు కలుస్తాయో నోటిఫికేషన్‌ వెలువడ్డాక తేలనుంది. అయితే గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీల్లో ప్రభావం చూపిన ప్రాంతాలపై వామపక్ష పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.

గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండడంతో ఇక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తులు కుదురుతాయి. ఈసారి అన్ని పార్టీలు జెడ్పీటీసీ ఎన్నికలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జెడ్పీ చైర్మన్‌ పదవిని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా ఉండడంతో కొన్ని స్థానాల్లో వ్యూహాత్మకంగా పొత్తులకు వెళ్లే అవకాశముంది. ఏదైనా రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటే అవసరాల మేరకు జెడ్పీటీసీ స్థానాల్లో పొత్తు కుదుర్చుకుని, జీపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల దాఖలు ప్రారంభమైతే తప్ప పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement