
పర్మిట్లలో లోపాలపై అధ్యయనం
● కలప అక్రమ రవాణాపై సీసీఎఫ్ సమీక్ష ● అటవీ ఉద్యోగుల విధులు, చెక్‌పోస్టుల నిర్వహణపై ఆరా
ఖమ్మంవ్యవసాయం: ఇటీవల వెలుగుచూసిన కలప అక్రమ రవాణా వ్యవహారాన్ని అటవీ శాఖ తీవ్రంగా పరిగణించి లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారం పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండగా జాతీయ స్థాయి సమస్యగా పరిగణిస్తున్నారు. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ల(ఎన్‌టీపీసీ) జారీలో ఉన్న లొసుగుల ఆధారంగా అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ అంశంపై జిల్లా అధికారులు ఇప్పటికే విచారణ పూర్తిచేయగా, భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) భీమానాయక్ మంగళవారం ఖమ్మం వచ్చారు.
మరింత నిఘా
ఖమ్మం అటవీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన సీసీఎఫ్.. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టంను అక్రమార్కులు ఎలా వినియోగించుకున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించడానికి ఎంచుకున్న మార్గాలపై చర్చించారు. అలాగే, అటవీ ఉద్యోగుల విధులు, చెక్‌పోస్టుల నిర్వహణపైనా ఆరా తీశారు. తప్పుడు పర్మిట్లతో సర్కారు తుమ్మ కలప మాటున సండ్ర కలపను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్‌కు తరలించిన అంశంపై వివరాలు తెలుసుకున్నారు. వాస్తవంగా చింతకాని అటవీ సెక్షన్‌లో సండ్ర కలప లేకున్నా ఇతర జిల్లాల నుంచి సేకరించి ఇక్కడ పర్మిట్ ఆధారంగా తరలించారని, ఇందుకోసం అక్రమార్కులు ఎన్‌టీపీసీ లోపాలను ఆధారంగా చేసుకున్నట్లు అధికారులు సీసీఎఫ్‌కు వివరించారు. ఇప్పటికే చింతకాని బీట్ ఆఫీసర్ శ్రీకాంత్‌పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈక్రమాన సూర్యాపేటకు చెందిన స్మగ్లర్ వ్యవహారంపై కూడా చర్చించిన అధికారులు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల రిజర్వ్ ఫారెస్టు నుంచి సండ్ర కలపను అక్రమంగా రవాణా చేయకుండా నిఘా ముమ్మరం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే, స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని సీసీఎఫ్ ఆదేశించారు. ఇదే సమయాన పర్మిట్లలో లోపాలు, ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై చర్చించి సాంకేతిక బృందానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా సీపీఎఫ్ భీమానాయక్ ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో అభివృద్ధి పనులను పరిశీలించి డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో చర్చించారు.