
ఆదర్శంగా మహనీయుల జీవితాలు
● వాల్మీకి జయంతిలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంమయూరిసెంటర్: మహనీయుల జీవితాలను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూలమాల వేసి నివాళులర్పించాక మాట్లాడారు. రామాయణం రచనతోవెలుగొందిన వాల్మీకి ఆదర్శ మానవులకు ఉండాల్సిన లక్షణాలను బోధించారని తెలిపారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, శాఖ ఉద్యోగులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మిర్చి యార్డులోనే
ఇకపై కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి యార్డులో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు జరుగుతుండగా, మిర్చి యార్డుకే మారుస్తూ మార్కెట్ కమిటీ నిర్ణయించింది. పత్తి విక్రయాలు పెరిగిన నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం సమావేశమై ఏసీ మిర్చి నమూనాల పరిశీలనకు తిరిగి మిర్చి యార్డునే వినియోగించాలని నిర్ణయించారు. అలాగే, నాన్ ఏసీ మిర్చి కొనుగోళ్లకు పత్తి యార్డులోని 7, 8వ షెడ్లను కేటాయించగా, లాట్ ఐడీల జారీ ఫైర్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఖమ్మం లీగల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్‌పై సోమవారం జరిగిన దాడిని నిరసిస్తూ ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. అలాగే, నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలపగా బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో న్యాయవాద సంఘాల బాధ్యులు మాట్లాడారు. సీజేఐపై జరిగిన దాడిని భారత న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తొండపు వెంకటేశ్వరరావు, గద్దల దిలీప్‌తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి సన్నిధిలో
చండీహోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లగా, మండపారాధన, గణపతి పూజ అనంతరం చండీహోమం చేశారు. ఈ పూజల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆతర్వాత శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచా మృతంతో అభిషేకం నిర్వహించారు.

ఆదర్శంగా మహనీయుల జీవితాలు