
ముగ్గురితోనే ముడి !
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
● జెడ్పీటీసీ స్థానాలకు ముగ్గురేసి అభ్యర్థులతో జాబితా ● మిగతా పార్టీల్లోనూ అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు ● నోటిఫికేషన్ విడుదలైతేనే పోటీపై స్పష్టత ● హైకోర్టు తీర్పు అనంతరం కదనరంగంలోకి దూకేలా ప్రణాళిక
సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంపై కోర్టు తీర్పు రావడమే కాక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వస్తేనే అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం కొట్టివేయగా హైకోర్టులో బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర అంశాలపై పార్టీలు అంతర్గతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేలా పరిశీలిస్తుండగా బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం కసరత్తు మొదలుపెట్టాయి.
కోర్టు తీర్పుపై ఉత్కంఠ.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జారీ చేసిన జీఓను కొట్టివేయాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక హైకోర్టులో బుధవారం జరగనున్న విచారణపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరగుతాయని హైకోర్టు చెప్పిన నేపథ్యాన అందరిలో ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఓ అభిప్రాయానికి రావాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ ఫోకస్
రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమ మార్క్ చూపించేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టింది. జెడ్పీటీసీ అభ్యర్థులను తామే ఖరారు చేస్తామని పీసీసీ వెల్లడించిన నేపథ్యాన ఒక్కో స్థానానికి ముగ్గురేసి బలమైన అభ్యర్థులతో జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా పరిశీలించాక పీసీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మండల స్థాయి నేతలతో సమావేశమవుతూ ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురి నుంచి ఆపై సంఖ్యలో అభ్యర్థుల జాబితా ప్రాథమికంగా రూపొందించినట్లు సమాచారం. కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ బరిలో ఉండేందుకు పది మంది కూడా పోటీ పడుతున్నట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు, నోటిఫికేషన్ వెలువడ్డాక ముగ్గురి పేర్లు ఖరారు చేసి పీసీసీకి ప్రతిపాదిస్తారు. ఇక వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జిల్లా స్థాయిలోనే జరగనుంది.
నోటిఫికేషన్ వెలువడ్డాకే..
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశంపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా తీర్పు వెలువడ్డాకే చూద్దాంలే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతర్గతంగా మాత్రం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించినా సీపీఐ, సీపీఎం వైఖరి స్పష్టం కాలేదు. కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తుందా.. ఒంటరిగా బరిలో దిగుతుందా, సీపీఎంతో జట్టు కడుతుందా అన్నది తేలాల్సి ఉంది. బరిలో ఉంటామని ఇప్పటికే సీపీఎం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే తప్ప పొత్తులు, పోటీపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
ఎంపీటీసీపై అనాసక్తి
ఆశావహుల్లో ఎక్కువ మంది జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులపైనే ఆశ పెట్టుకున్నారు. ఈ విషయాన్ని నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎంపీపీ అయ్యేందుకు అవకాశం ఉందని భావిస్తున్న వారే ఎంపీటీసీగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అలా సాధ్యం కాదనుకునే వారు ఎంపీటీసీగా పోటీకి అయిష్టత కనబరుస్తున్నారు. దీంతో పార్టీల్లో జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ పెరుగుతుండగా.. కొందరు తామే పోటీ చేస్తామంటూ ప్రచారం చేసుకుంటుండడం ముఖ్యనేతలకు ఇబ్బందికరంగా మారింది.