
హైవేకు సర్వీసు రోడ్లు ఏర్పాటుచేయించండి
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అవసరమైన చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, లేకపోతే రైతులు ఇబ్బందిపడతారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈమేరకు రోడ్లు నిర్మించేలా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ హైవేతో భూములు రెండుగా చీలినందున సర్వీసు రోడ్లు లేకపోతే పొలాలకు వెళ్లడానికి రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు. నాయకులు బండారు నరేష్, యార్లగడ్డ రాఘవరావు పాల్గొన్నారు.