
మమ్మేలు తల్లీ
అమ్మా మైసమ్మా..
కోటమైసమ్మ తల్లి జాతరకు
పోటెత్తిన భక్తజనం
కారేపల్లి: అమ్మా మైసమ్మా.. మా తల్లీ మైసమ్మా.. మమ్మేలు తల్లీ భక్తజనం తన్మయత్వంతో ఊగిపోయారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన కోట మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఏటా దసరాకు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జిల్లా నుంచే భద్రాద్రి, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు ప్రభబండ్లు, వాహనాలో తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన ఈనెల 7వ తేదీ వరకు జరిగే జాతరకు ఏర్పాట్లు చేయగా భక్తులు తల్లిని దర్శించుకున్నారు. కాగా, జాతరకు వచ్చిన భక్తులకు ఆటవిడుపుగా సోలాపూర్ సర్కస్, జాయింట్ వీల్ ఏర్పాటుచేయడంతో చిన్నాపెద్ద తేడా లేకుండా రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ బి.గోపి ఆధ్వర్యాన ఇద్దరు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు, 100మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో జాతర ప్రాంగణం నుంచి సోలార్ ప్లాంట్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాలు మళ్లించారు. కోటమైసమ్మను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ ఈఓ గుట్టకింది వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు పర్యవేక్షిస్తున్నారు.

మమ్మేలు తల్లీ

మమ్మేలు తల్లీ