భలే మంచి ‘బెల్టు’ బేరం!
వజ్రపుకొత్తూరు రూరల్ : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారథిలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామంలో శుక్రవారం నుంచి గ్రామ దేవత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో అనధికారికంగా బెల్ట్ షాపు నిర్వహణకు వేలంపాట వేశారు. దీంతో.. రూ.9 లక్షలకు బెల్టు షాపును దక్కించుకున్న వారు ప్రభుత్వ పాఠశాల ఎదురుగానే దుకాణం తెరిచారు. కళ్లెదురుగానే ఈ తంతు జరుగుతున్నా ఎక్సైజ్ , పోలీసు అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. ఇక్కడ ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.30 అదనంగా వేసి మరీ అమ్ముతున్నారు.అనధికార బారు షాపు ఏర్పాటు కోసం ఎక్సైజ్ అధికారులకు రూ.1 లక్ష, పోలీసులకు రూ.50 వేలు గ్రామం నుంచి అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపు నిర్వాహకులు వారం ముందు నుంచే అక్కడ బార్ షాపు తెరిచారు. పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో రెండ్రోజుల పాటు విక్రయాలు బంద్ అయ్యాయి. దీంతో టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులను మచ్చిక చేసుకోవడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావును వివరణ కోరగా.. బెల్ట్ షాపు విషయం తమ దృష్టికి వచ్చిందని, షాపుని మూసేసి మద్యం అమ్మకాలను నియంత్రించామని చెప్పారు.