
తెల్కపల్లి రామచంద్రశాస్త్రి
తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి(1902-90) కవి, సంస్కృత పండితుడు.
స్మృతి సంచిక
తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి(1902-90) కవి, సంస్కృత పండితుడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రశాస్త్రాల్లో కూడా ఆయనకు అధికారం ఉండేది. పుట్టింది, ఇప్పటి మహబూబ్‌నగర్ జిల్లా రాజాపురం. తాను చదివిన బందరు కళాశాలలోనే సంస్కృతోపన్యాసకునిగా పనిచేశారు. 1934లో గద్వాల సంస్థానంలో ఆస్థాన సంస్కృత పండితులుగా నియమింపబడినారు. బెజవాడ గోపాలరెడ్డికి గురువు. విశ్వనాథకు సహోపన్యాసకులు. అయినా విశ్వనాథ స్వయంగా తెల్కపల్లి దగ్గర ‘గీత గోవిందం’ చదువుకున్నారట!
కవికాంతా స్వయంవరః, శ్రీ గురుపీఠ తత్వదర్శనమ్, శ్రీ హయగ్రీవ శతకమ్, శ్రీ శారదాస్తుతి శతకమ్, శివానందాష్టకమ్, రవీంద్ర తపఃఫలం లాంటి 15 రచనలు చేశారు. విక్రాల నరసింహాచార్యులతో కలసి కొంతకాలం జంటకవిత్వం చెప్పారు. అష్టావధానం చేశారు. బులుసు అప్పన్నచే ‘అభినవ కాళిదాస’ అనీ, సురవరం ప్రతాపరెడ్డిచే ‘సాహిత్య కల్పద్రుమ’ అనీ అనిపించుకున్నారు. అంతటి తెల్కపల్లి ‘కానరాని భాస్కరుడు’ కాకూడదన్న సంకల్పంతో రవిప్రకాశరావు ఈ పుస్తకం తెచ్చారు. ఇందులో కపిలవాయి లింగమూర్తి రాసిన తెల్కపల్లి క్లుప్త జీవిత చరిత్ర సహా, తెల్కపల్లి పీఠికలు, అప్పటి సాహిత్య, సాంఘిక వివాదాల్లో తెల్కపల్లి పాత్ర, ఆత్మీయుల స్పందనలు లాంటివి వేర్వేరు భాగాలుగా ఉన్నాయి.
నిజానికి తెల్కపల్లి బతికివున్నప్పుడే, ఆయన ‘అశీతివర్ష పూర్త్యభినందన సంచిక’(80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా) కోసం దేశిరాజు సీతారామారావు ఈ వ్యాసాల్ని రాయించినా, అప్పటి రాజకీయ కారణాల వల్ల సంచిక వెలుగు చూడలేదు. మరికొన్ని జోడించి, పాతికేళ్ల తర్వాతైనా తన చొరవతో పుస్తకం తెస్తున్న సంబరాజు అభినందనీయులు.