రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జిల్లా జెడ్పీ మహిళా చైర్‌పర్సన్ జానీమూన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇప్పటికే మంత్రి తన ఇంటిపై పలుమార్లు దాడి చేయించారని, కనీసం గౌరవం ఇవ్వకుండా కక్ష సాధింపునకు దిగుతున్నారని మీడియా సమావేశంలో ఆమె విలపించడం అందరినీ కలచివేసింది. తనకు భద్రత పెంచాలని, ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చాలంటూ గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు లేఖలు రాశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ మంత్రి నుంచే అదే పార్టీకి చెందిన మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌కు వేధింపులు ఎదురుకావడం పట్ల మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. శనివారం పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు.ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.