
కమనీయం.. కడు రమణీయం
బ్రహ్మోత్సవాల్లో నేడు
● నేత్రపర్వంగా చిన వెంకన్న కల్యాణోత్సవం
● నేడు రథోత్సవం
ద్వారకాతిరుమల: సర్వ జగద్రక్షకుడు.. కలియుగ వైకుంఠుడైన శ్రీవారు, నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెండ్లాడారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి ఆలయ అనివేటి మండపంలో అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయం నుంచి సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను రెండు వేర్వేరు వాహనాలపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అర్చకులు వేడుకను ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తి చేసిన తర్వాత శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావులు కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామివారు ఉదయం సింహ వాహనంపై, కల్యాణ వేడుక అనంతరం రాత్రి వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి పర్యవేక్షించారు. విశేష అలంకారాల్లో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.
ఉదయం 8 గంటల నుంచి భజనలు
ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని
ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి
సాయంత్రం 5 గంటల నుంచి హరికథ
సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం
ప్రత్యేక అలంకారం : రాజమన్నార్

కమనీయం.. కడు రమణీయం

కమనీయం.. కడు రమణీయం

కమనీయం.. కడు రమణీయం