
మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
భీమవరం: మధ్యాహ్న భోజన కార్మికుల సమ స్యలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూళ్లలో ఐదుగురు పనిచేస్తుంటే ముగ్గురికే వేతనాలు ఇస్తున్నారని, 9 ,10 తరగతుల విద్యార్థులను లెక్కల్లోకి తీసుకోకుండా 25 మందికి ఒక జీతం చొప్పున ఇస్తున్నారన్నారు. కూరగాయలు, నిత్యావసర సరకులు ధరలు ఆకాశనంటుతున్నా పాత మెనూ చార్జీలనే అమలు చేయడం దారుణమన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మదీనా బీబీ, నాగమణి మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభు త్వం అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్స్ లేవని అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వాపోయారు. అందరికీ ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఏడీకి వినతిపత్రం అందజేశారు.