
కొల్లేరు కథ.. కంచికి చేరేనా!
● నేడు సుప్రీంకోర్టులో వాదనలు
● అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ సమీక్ష
కై కలూరు: సుప్రీం కోర్టులో కొల్లేరు సమస్యలపై బుధవారం వాదనలు జరగనున్నాయి. దీంతో ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కీలక సమావేశం బుధవారం జరిగింది. కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు హాజరయ్యారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవనన్, కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కొల్లేరు అంశాలపై చర్చించారు. అనంతరం తాడేపల్లి సీఎంవోలో కొల్లేరుపై సమావేశమయ్యారు. కొల్లేరు అభయారణ్య ఆక్రమణలపై విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృత్యుంజయరావు ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో రెండు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నివేదిక తమకంటే తమకు అనుకూలంగా వస్తుందని పర్యావరణవేత్తలు, కొల్లేరు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. సీఈసీ అడిగిన వాస్తవ వివరాలను అటవీ, రెవెన్యూ, డ్రైనేజీ శాఖలు అందించలేదు. దీంతో పూర్తి స్థాయి సమాచారం పంపించాలని సీఈసీ కోరింది.
కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతున్నా కూటమి నేతలను ఎదిరించి ఒక్క గట్టు ధ్వంసం చేయలేని స్థితిలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. మరోపక్క కొల్లేరు అక్రమ చేపల చెరువుల ధ్వంసం సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు పదేపదే అడుగుతోంది. క్షేత్ర స్థాయి లెక్కలను చూపించడంలో అటవీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కొల్లేరు అంశాల అధ్యాయానికి వచ్చిన ప్రత్యేక సెక్రటరీ కాంతిలాల్ దండేకు కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజలు వినతిపత్రాన్ని అందించారు. గోకర్ణపురం – చింతపాడు రహదారిలో 5 కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎకరాల డీ–ఫాం భూములను మినహాయించి పేదలకు పంపిణి చేయాలన్నారు.