
సీజేఐపై దాడికి నిరసనగా ర్యాలీ
భీమవరం: ప్రజల హక్కులను కాపాడేది న్యాయ వ్యవస్థేనని, ఈ వ్యవస్థలో అణగదొక్కాలనో లేదా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనో ప్రయత్నించినప్పుడు మేమంతా సంఘటితమేనని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం భీమవరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. టూటౌన్ ప్రాంతంలోని కోర్డుల సముదాయం నుంచి పాత కోర్టుల ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ న్యాయదేవత విగ్రహానికి జలాభిషేకం చేసి శుద్ధి చేసారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, ఏపీపీ ఉండవల్లి రమేష్ నాయుడు, ఏజీపీ ఉచ్చుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం
భీమవరం: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడి దేశ రాజ్యాంగంపై దాడేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్, కెవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అన్నారు. గవాయ్‌పై దాడిని ఖండిస్తూ మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతిబాబు మాట్లాడుతూ జడ్జిపై దాడి ముమ్మాటికీ రాజ్యాంగ వ్యవస్థపై దాడి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రజల మధ్య విభేదాలకు, విభజనకు బీజేపీ ఎలా పాల్పడుతుందో ఈ ఘటన అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, జైభీమ్ సేవా దళ్ నాయకుడు మీసాల జయరాజు, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.