
చెత్త డంప్‌ను అడ్డుకున్న స్థానికులు
● నరసాపురం 28వ వార్డులో ఉద్రిక్తత
● ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
నరసాపురం: నరసాపురం మున్సిపాలిటీలో చెత్త డంప్ చేసే విషయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా, మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా చెత్తను డంప్ చేయడంతో పట్టణంలోని 28 వ వార్డులో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు చెత్త డంప్‌ను అడ్డుకోవడమే కాకుండా, కొందరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్ల మధ్య ఉన్న మున్సిపల్ స్థలంలో చెత్తను డంప్ చేశారు. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఏళ్ల తరబడి చెత్తను గోదావరి గట్టున పోస్తున్నారు. ఇటీవల చెత్త వేయొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో చెత్తను వేయడానికి మున్సిపాలిటీకి జాగా లేకపోయింది. దీంతో చెత్తను 28వ వార్డులో ఉన్న తుంగపాటి చెరువు వద్ద మున్సిపల్ స్థలంలో వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రాంతం మొత్తం నివాస గృహాలు ఉండటంతో సమస్య మొదలైంది. గతంలో ఒకసారి చెత్తను ఈ ప్రదేఽశంలో డంప్ చేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. మంగళవారం మళ్లీ ఇక్కడ చెత్తను డంప్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తత
చెత్త వాహనాలు రాగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దళితులు ఉండే ఇళ్ల మధ్య చెత్తను ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని చెత్తను ఇక్కడ డంప్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల సాయంతో చెత్తను మున్సిపల్ స్థలంలోనే డంప్ చేశారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ ఎమ్మెల్యే నాయకర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని హెచ్చరించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.