
చిరుద్యోగుల పోరుబాట
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె విరమణ సందర్భంగా అప్పట్లో సంబంధిత అధికారులు కార్మిక సంఘాలతో చేసుకున్న ఏ ఒక్క ఒప్పందాన్ని, హామీని అమలు చేయక చేయకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్‌సీ ప్రకటించి ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెం.36 ప్రకారం నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని, 2023 డిసెంబర్ సమ్మెకాలపు ఒప్పందాల అమలుకు తక్షణం జీవోలు విడుదల చేయాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు.
రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై గతంలో సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం తరఫున ఒప్పందాలు కుదుర్చుకున్న అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ విభాగానికి పంపించారు. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల ఫైలును ఆమోదించకుండా ఫైనాన్స్ డిపార్టుమెంట్ వద్ద ఉన్న ఫైలును వెనక్కు రప్పించడం పట్ల మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈనెల 8న ధర్నాలు నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది.
చాలీచాలని వేతనం ఎన్నాళ్లు?
మున్సిపల్ కార్మికులకు ఇచ్చేది కొద్దిపాటి వేతనమే. అయినా వారితో చేయించేది గొడ్డు చాకిరీ.. ఎప్పటికై నా తమ బతుకుల్లో వెలుగులు రాకపోతాయా? తమ సమస్యలు తీరకపోతాయా? అనే ఆఽశతో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు మౌనంగా తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం సమ్మె చేశారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దీంతో మళ్ళీ ఆందోళన బాట పట్టారు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు. దీనిలో భాగంగా ఇప్పటికే మస్తర్ పాయింట్ల వద్ద తెల్లవారుజామున ఆందోళన చేశారు.
90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే
ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్లో 90 శాతం మంది ఆప్కాస్ ఉద్యోగులే ఉన్నారు. ఏలూరు నగర పాలక సంస్థలో దాదాపు 1,170 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 800 మంది, స్కూల్ స్వీపర్లు 120 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు, కార్మికులు అంతా ఆప్కాస్ ఉద్యోగులే.
సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కుతున్న మున్సిపల్ కార్మికులు
సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్
ఇంజనీరింగ్ కార్మికులకు రూ.21 వేలు చేయాలి
నేడు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ధర్నాలు

చిరుద్యోగుల పోరుబాట