
దివ్య రథంపై.. దేవదేవుడి విహారం
● ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం
● నేడు చక్రస్నానం, ధ్వజావరోహణం
● ఉదయం 8 గంటల నుంచి – భజనలు
● ఉదయం 9 నుంచి – భక్తిరంజని
● ఉదయం 10.30 నుంచి–చక్రవారి, అపభృదోత్సవం
● ఉదయం 11 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● సాయంత్రం 4 నుంచి – నాదస్వర కచేరి
● సాయంత్రం 5 నుంచి – బుర్రకథ
● సాయంత్రం 6 నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● రాత్రి 8 గంటల నుంచి – భక్తిరంజని
● రాత్రి 9 గంటల నుంచి – నాటకం
● రాత్రి 9 గంటల నుంచి – ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం
● ప్రత్యేక అలంకారం : వైకుంఠ నారాయణుడు
ద్వారకాతిరుమల: బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుడిని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందంతో దేవదేవుని కనులారా కాంచిన వారిది కదా జన్మ ధన్యము.. మహిమాన్విత రథంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని సేవించిన వారు కదా పునీతం.. గోవింద నామస్మరణలతో పులకించిన వారిది కదా ముక్తి మార్గం.. రథ వాహనంలో విహరిస్తున్న అలంకార ప్రియుడి కటాక్షం పొందిన వారి జీవితం కదా చరితార్ధం.
ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉభయ దేవేరులతో కలసి దేవదేవుడు దివ్య రథంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. తొలుత ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు, డీఈఓ భద్రాజీ, ఈఈ డీవీ భాస్కర్, డీఈ, ఏఈఓలు, సూపరింటిండెంట్‌లు పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, వేషధారణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవింద నామస్మరణలతో మహా రథం లాగుతూ తన్మయత్వం చెందారు.

దివ్య రథంపై.. దేవదేవుడి విహారం

దివ్య రథంపై.. దేవదేవుడి విహారం