
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ధర్నా
భీమవరం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రవేటీకరణను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ కోన జోసఫ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణ దళితులకు తీరని నష్టమన్నారు. నిరుపేదలు, బలహీనవర్గాలకు విద్య విషయంలో అండగా ఉండి ప్రోత్సహించాల్సిన కూటమి ప్రభుత్వం ప్రవేటీకరణ బాట పట్టడం దారుణమన్నారు. ఈది రవికుమార్, జంగం మాణిక్యాలరావు, బి.కమలాకర్, పట్టెం శుభాకర్, కొండేటి లాజర్, గాతల సందీప్, గంటా రాహుల్ రిచర్డ్స్, అంబటి ఆనందకుమార్ పాల్గొన్నారు.
భీమవరం: పెంచిన పని గంటలు తగ్గించాలని, ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును రద్దు చేయాలని మంగళవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పోరాటం చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే నేడు కార్పొరేట్, సంపన్నుల కోసం 13 గంటల పని విధానాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలు పని చేసే చోట సరైన సౌకర్యాలు, రక్షణ లేకపోవడంతో పని గంటలు పెంచడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల హరే రామ్, సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, వైకుంఠరావు, జార్జి పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో దీపావళి టపాసులు తయారీ, అమ్మకాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాలని ఆదేశించారు. లైసెన్సు లేకుండా టపాసులు తయారుచేసినా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో లైసెన్సులు పొంది ప్రస్తుతం రెన్యువల్ కానీ మందు గుండు సామగ్రి తయారీ షెడ్లను క్షేత్రస్థాయిలో పోలీస్, రెవిన్యూ శాఖలు విధిగా తనిఖీచేసి ధ్రువీకరించాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తనిఖీల్లో లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.