
బాధితులకు పోలీస్ శాఖ భరోసా
భీమవరం: వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీస్ శాఖ భరోసాగా ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. 16 ఫిర్యాదులు అందగా పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలోని 20 మండలాల్లో సోమ వారం 370.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అత్తిలిలో 81 మిల్లీమీటర్లు నమోదుకాగా పెంటపాడులో 52, మొగల్తూరులో 38.4, వీరవాసరంలో 27.8, తాడేపల్లిగూడెంలో 15.2, తణుకులో 2.6, గణపవరంలో 25.4, ఆకివీడులో 1.2 మి.మీ. వర్షం కురిసింది. ఉండిలో 8.6, పాలకోడేరులో 1.6, పెనమంట్రలో 22.2, ఇరగవరంలో 2.2, పెనుగొండలో 18.6, ఆచంటలో 17, పోడూరులో 13.4, భీమవరంలో 15.6, కాళ్లలో 3.8, నరసాపురంలో 9.4, పాలకొల్లులో 13, యలమంచిలిలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.