ఉసూరుమనిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉసూరుమనిపింఛెన్‌

Oct 7 2025 4:03 AM | Updated on Oct 7 2025 4:03 AM

ఉసూరు

ఉసూరుమనిపింఛెన్‌

50 ఏళ్లకే పెన్షన్‌ ఊసే ఎత్తడం లేదు

ఎన్నికల హామీలు పట్టవా?

నెలనెలా కోత

సాక్షి, భీమవరం: పేదవర్గాలకు ఆర్థిక భరోసానిచ్చే సామాజిక పింఛన్ల మంజూరును కూటమి సర్కారు విస్మరించింది. 15 నెలల పాలనలో కొత్త పింఛన్‌ ఒక్కటీ ఇవ్వలేదు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ సైట్‌ను సైతం ఆఫ్‌లోనే ఉంచేసింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు.

వెబ్‌సైట్‌ క్లోజ్‌

గత ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసేవారు. 2023 జూలై నుంచి డిసెంబరు వరకు వచ్చిన దరఖాస్తులు మేరకు 2024 జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. మరలా జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను క్లోజ్‌ చేయడంతో పాటు దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను నెలల తరబడి నిలిపివేసింది. పింఛన్ల కోసం పేదలు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు.

వేలల్లో దరఖాస్తులు

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. గతంలో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సచివాలయ ఉద్యోగులు వెరిఫికేషన్‌ చేసి అర్హులైన వారికి ఆన్‌లైన్‌ చేసేవారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు లాగిన్‌ నిలిపివేయడంతో ఆన్‌లైన్‌ చేసే వీలులేక త్వరలో కొత్త పింఛన్లు వస్తాయంటూ దరఖాస్తుదారులను చెప్పి పంపాల్సి వస్తుందని వారంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పింఛన్‌ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పౌజ్‌ పింఛన్లతో సరి

పేదవర్గాల్లో కుటుంబ యజమాని మృతి చెందితే భార్యకు ఆసరాగా వితంతు పింఛన్‌ మంజూరు చేయడం పరిపాటి. కాగా జిల్లాలో పింఛన్‌ తీసుకుంటూ 3,988 మంది లబ్ధిదారులు మృతిచెందగా వారి భార్యలకు మాత్రమే కూటమి ప్రభుత్వం స్పౌజ్‌ కోటాలో పింఛన్లు అందజేసింది. గతంలో ఎప్పటికప్పుడు స్పౌజ్‌ పింఛన్లు మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆగస్టులో వీటిని అందజేసింది. స్పౌజ్‌ పింఛన్లనే కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయిన పేద మహిళలు ఎంతోమంది వితంతు పింఛన్‌ సాయం కోసం ఎదురుచూస్తున్నా వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

50 ఏళ్లకే పింఛన్‌ హామీ అమలేది?

50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్‌ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఊదరగొట్టారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పింఛన్‌కు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేయకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

బురిడీ సర్కార్‌

పింఛన్ల ఊసెత్తని కూటమి ప్రభుత్వం

15 నెలల్లో కొత్త పింఛన్‌ ఒక్కటీ మంజూరు చేయని వైనం

కూటమి సర్కారు వచ్చే నాటికి జిల్లాలో పింఛన్లు 2,32,885

ప్రస్తుతం 2,26,127కు తగ్గిన వైనం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ హామీ గాలికి..

అర్హత ఉన్నా సాయం అందక నష్టపోతున్న పేదలు

కూటమి ప్రభుత్వం దళితులు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు. పింఛన్ల కోసం సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నారు.

– ఉండవల్లి జానకి, తణుకు

స్పౌజ్‌ పింఛన్లనే కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం విడ్డూరం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కొత్తవి కొర్రీలు లేకుండా మంజూరు చేయాలి. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్‌ అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. గద్దెనెక్కిన తర్వాత హామీ అమలు దిశగా చర్యలు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది.

– వర్ధనపు సుధాకర్‌, రుస్తుంబాద

కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఖజానాపై భారం పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్‌లో జిల్లాలో పింఛన్‌ లబ్ధిదారులు 2,32,885 మంది ఉండగా ఈ అక్టోబరు నాటికి వారి సంఖ్య 2,26,127లకు తగ్గింది. ఈ మేరకు ప్రతినెలా వారికి అందించే సాయం తగ్గుతోందంటున్నారు. ఏడాదిన్నర కాలంలో జిల్లాలో 6,758 పింఛన్లు తగ్గిపోగా సుమారు రూ.20 కోట్లకు పైనే భారం తగ్గించుకుంది.

ఉసూరుమనిపింఛెన్‌ 1
1/2

ఉసూరుమనిపింఛెన్‌

ఉసూరుమనిపింఛెన్‌ 2
2/2

ఉసూరుమనిపింఛెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement