
డ్రైవర్ల సేవలో..నూ కూటమి కుట్ర
90 శాతం ఫైనాన్స్‌పైనే..
భీమవరం(ప్రకాశం చౌక్): బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు ఆర్థికా సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ నీటిమూటగా మారింది. ఆటో డ్రైవర్ల సేవలో.. పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం లబ్ధి కొందరు ఆటో డ్రైవర్లకు మాత్రమే అందించి వేలాది మందికి మొండిచేయి చూపించింది. నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై డ్రైవర్లు గుర్రుగా ఉన్నారు. ఈ పథకంలోనూ 18 రకాల నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్ర చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సుమారు 16 వేల మంది వరకూ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. తెల్ల రేషన్ కార్డు, ఏడాదికి ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉన్నా వీరిలో 8 వేల మందికి మాత్రమే ఆటో డ్రైవర్ సేవలో ప థకం కింద లబ్ధి అందించి మిగిలిన వారికి అనర్హులుగా తేల్చడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. లబ్ధిదారులను 50 శాతానికి పరిమితం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవనం కష్టసాధ్యం
అంతంతమాత్రం ఆదాయంతో ఆటోల నిర్వహణ, కష్ట సాధ్యంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం అందించే సాయంలోనూ కోత విధించం తగదని డ్రైవర్లు అంటున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి నడుపుతూ జీవనం పొందుతున్నామని, అయితే ప్రస్తుతం నెలావారీ వాయిదాలు చెల్లించడం కష్టసాధ్యంగా ఉందని వాపోతున్నారు. అందరికీ సాయం అందిస్తామని హామీ ఇచ్చి పథకం అమలు చేసే సమయంలో నిబంధనలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు.
కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కూ ఆర్థిక సాయం అందించాలి. నిబంధనల పేరుతో కోత విధించడం దారుణం. కూటమి ప్రభుత్వం అందరికీ ఆర్థిక సాయం చేస్తుందనుకున్నాం. అయితే కొందరికే అందించారు. జిల్లాలో 16 వేల మంది డ్రైవర్లు ఉంటే 8 వేల మందికే అందించడం బాధాకరం. ఆర్థిక సాయం అందని వారిని గుర్తించి న్యాయం చేయాలి. మేనిఫెస్టోను పక్కాగా అమలు చేయాలి.
–ఇంటి సత్యనారాయణ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు
నేను 15 ఏళ్లగా ఆటో ద్వారా ఉపాధి పొందుతున్నాను. గత ప్రభుత్వంలో నాకు వాహన మిత్ర సాయం వరుసగా అందించారు. ఇప్పుడు కూటమి పాలనలో విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉందనే సాకుతో రూ.15 వేలు ఆర్థిక సాయం అందించలేదు. రెండు పోర్షన్ల ఇంటిలో నేను, మా తల్లి ఉండేవాళ్లం. రెండు మీటర్లు ఉండగా, ఇవి నా ఆధార్‌తో అనుసంధానం కావడం వల్ల ఆర్థిక సాయం అందించలేదు. నిబంధనలు పక్కన పెట్టి ఆటోపై బతికే ప్రతి డ్రైవర్‌కూ సాయం అందించారు.
– చవ్వుకుల రాజేష్, ఆటో డ్రైవర్ అండలూరు
ఆటోడ్రైవర్ల సేవలో పథకానికి అర్హత ఉన్నా నాకు సాయం అందించలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే అక్కడ కూడా సరైన సమాచారం లేదు. నేను 15 ఏళ్లుగా ఆటో ద్వారా ఉపాధి పొందుతున్నాను. నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. 300 యూనిట్లలోపే విద్యుత్ బిల్లు కూడా వస్తుంది. అయినా సాయం అందలేదు. అర్హత ఉన్నా కూడా ఆర్థిక సాయం అందుకోలేకపోయాను. నాలాంటి వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి.
– పాలా విజయకుమార్, ఆటో డ్రైవర్, వేండ్ర
నిబంధనల మెలిక
కొందరికే ఆర్థిక సాయం
జిల్లాలో ఆటో డ్రైవర్లు సుమారు 16 వేల మంది
సాయం అందింది కేవలం 8 వేల మందికే..
అప్పులు, ఫైనాన్స్‌లతో జీవనం అగమ్యగోచరం
బ్యాడ్జ్ ఉన్న వారందరికీ ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ
జిల్లాలో సుమారు 16 వేల ఆటోలు ఉండగా 90 శాతం వరకూ ఆటోలను ఫైనాన్స్‌లో తీసుకుని డ్రైవర్లు నడుపుతున్నారు. వీరి రోజు వారీ సంపాదనలో 50 శాతం నెలవారీ వాయిదా కోసం కేటాయిస్తున్నారు. మిగిలిన దాంతో ఆటో నిర్వహణ, కుటుంబ పోషణ పరిపోని పరిస్థితి. కనీసం ఫైనాన్స్‌లకు వాయిదాలు చెల్లించేందుకు కూడా సొమ్ములు రావడం లేదని, కుటుంబ జీవనం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వ సాయం కూడా అందకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర సాయం అందించినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకని అంటున్నారు. హామీ మేరకు డ్రైవర్లందరికీ లబ్ధి చేకూర్చాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం అందించిన లబ్ధిని గుర్తుచేసుకుంటున్నారు.

డ్రైవర్ల సేవలో..నూ కూటమి కుట్ర

డ్రైవర్ల సేవలో..నూ కూటమి కుట్ర

డ్రైవర్ల సేవలో..నూ కూటమి కుట్ర