
సబ్ జైలు సందర్శన
భీమవరం: భీమవరంలో ప్రత్యేక సబ్ జైలును ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎస్.శ్రీదేవి, సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ సందర్శించారు. ముద్దాయిలు కోరితే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. జైలులో ఏర్పాట్లపై ఆరా తీశారు. రోజూ యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జైలు పరిసరాలను, మహిళా బ్యారక్‌ను, సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్‌ను, వంటశాలను తనిఖీ చేసి, భోజనాన్ని రుచిచూశారు. పరిసరాల్లో మొక్కలు పెంచాలని జైలు పర్యవేక్షణాధికారిని సూచించారు. జైలు ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్ బంకును చూసి ప్రశంసించారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి, న్యాయవాదులు ఉన్నారు.
యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక వద్ద కాజ్‌వే మునిగింది. కాజ్‌వేపై నుంచి సుమారు నాలుగడుగుల నీరు ప్రవహించడంతో అధికారులు ఇంజన్ పడవలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది వరదలకు కాజ్‌వే మునగడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగుల నీరు ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల వరకూ కాజ్‌వే ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
సిద్ధాంతంలో..
పెనుగొండ: వశిష్ట గోదావరి నిండుగా ప్ర వహిస్తోంది. రెండు రోజుల్లో సుమారు ఏడడుగుల మేర నీరు పెరిగింది. సిద్ధాంతంలో కేదార్‌ఘాట్, పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోవడానికి కేవలం మూడు మెట్లు మాత్రమే ఉన్నాయి. వరద నీరు సిద్ధాంతం పుష్కరాల రేవులను పూర్తిగా ముంచెత్తింది. పడవలపై రాకపోకలు సాగించే లంక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యస్థ లంకలోకి రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. కోడేరు, అయోధ్యలంక, ఇతర లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతుంది. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
నరసాపురం: ఎగువ ప్రాంతం నుంచి నరసాపురంలో వశిష్ట గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నరసాపురం–సఖినేటిపల్లి పడవల రేవులో ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. రేవులో ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ఆదివారం పంటు రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు. పరిస్థితిని బట్టి సోమ, మంగళవారాల్లో పంటు రాకపోకలు పునరుద్ధరిస్తామని తహసీల్దార్ అయితం సత్యనారాయణ తెలిపారు.

సబ్ జైలు సందర్శన