
విజయనగరం విజయదుందుభి
● రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానం
గొలుగొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విజయనగరం విజయదుందుభి మోగించింది. అండర్–14 బాల, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లలో ఈ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ హైస్కూల్‌లో ఈ నెల 4న ప్రారంభమైన పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో విజయనగరం, గుంటూరు బాలుర జట్లు తలపడ్డాయి. ఇందులో 2 పాయింట్లు తేడాతో విజయనగరం జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు ద్వితీయ స్థానానికి పరిమితమైంది. అనంతరం బాలికల పోరులో విజయనగరం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో విజయనగరం బాలికలదే పై చేయి అయింది. ఒక పాయింట్ తేడాతో విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లకు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు, కృష్ణదేవిపేట పూర్వపు ఎస్‌ఐ తారకేశ్వరరావు, సాఫ్ట్‌బాల్ నిర్వహణ ప్రతినిధులు రమణ, శ్రీనివాసరావు, సుమంత్‌రెడ్డి, సూర్య దేముడు, సతీష్, భవానీ, చంద్రమోహన్ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.