
తక్కువ ధరకే బంగారం పేరిట మోసం
● రూ. 12 లక్షలు కాజేసిన వైనం
● నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పార్వతీపురం రూరల్: తన భార్యకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్‌నే మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని ఏకంగా రూ. 12 లక్షలు కాజేశాడు. తక్కువ ధరకే బంగారాన్ని ఇప్పిసానంటూ నమ్మించి నిలువునా ముంచేసిన ఈ కేటుగాడితో పాటు మరో 8 మంది సభ్యుల ముఠాను పార్వతీపురం రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కేసును ఛేదించారు.
అసలేం జరిగిందంటే...
శ్రీకాకుళానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి గతంలో శ్రీకాకుళం రూరల్ మండలం సింగువలస వద్ద పనిచేసే సమయంలో నిందితుడు కొత్తూరు మండలం గొట్టుపల్లి పంచాయతీ పుల్లగూడకు చెందిన జి. రిషివర్థన్ భార్య చదువుకునేది. దీంతో ప్రధానోపాధ్యాయురాలితో రిషివర్థన్‌కు పరిచయం ఉంది. ఈ క్రమంలో తాను బంగారం వ్యాపారం చేస్తున్నానని.. చాలా తక్కువ ధరకే నాణ్యమైన బంగారు బిస్కెట్లు ఇప్పించగలనని ప్రధానోపాధ్యాయురాలిని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది ఆగస్టు 11న రూ. 12 లక్షల నగదు పట్టుకుని బంగారం కొనేందుకు శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వైపు రిషివర్థన్‌తో వస్తుండగా.. ముందస్తుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం పార్వతీపురం శివారులో వాటర్ పంప్‌హౌస్ సమీపంలో కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా వచ్చి వీరిని భయభ్రాంతులకు గురిచేసి లక్ష్మి చేతిలో ఉన్న నగదు తీసుకుని పరారయ్యారు. వెంటనే బాధితురాలు పార్వతీపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పక్కా స్కెచ్‌తో పట్టించారు..
ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పార్వతీపురం సీఐ రంగనాథం, రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పక్కా వ్యూహంతో ఈ అంతర్ జిల్లా ముఠా గుట్టు రట్టు చేశారు. ముందుగా రిషివర్థన్ కదలికలపై నిఘా పెట్టి ప్రధాన నిందితుడు అతనే అని నిర్ధారణకు వచ్చారు. అతనితో పాటు పార్వతీపురం, సాలూరు, విజయనగరం, ఒడిశాకు చెందిన మొత్తం 8 మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల నగదుతో పాటు కారు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

తక్కువ ధరకే బంగారం పేరిట మోసం