
అర్జీదారుల సంతృప్తే లక్ష్యం
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: అర్జీదారుల సంతృప్తే లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సమస్యలు తెలియజేస్తే పరిష్కారమవుతాయనే నమ్మకం అర్జీదారులకు కలిగించాలని అధికారులను సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి సుమారు వంద వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంతవరకు అర్జీదారుని సమక్షంలోనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరవై రోజులుగా 50 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా లేదని, వెంటనే సమస్య పరిష్కరించాలని గరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీకి చెందిన రైతులు వినతి అందజేశారు. అలాగే తమ గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా.. ఉపాధి నిధులు దుర్వినియోగం.. క్షీణించిన పారిశుధ్యంపై వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామానికి చెందిన రామినాయుడు ఫిర్యాదు చేశారు. మార్కెట్ స్థలాన్ని కొందరు ఆక్రమించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన బెహరా కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎం. సుధారాణి, అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.