
పట్టణంలో విస్తృత తనిఖీలు
విజయనగరం క్రైమ్: పైడితల్లి తోలేళ్లు, సిరిమాను జాతర నేపథ్యంలో అంతర్రాష్ట్ర ముఠాలు దిగాయన్న సమాచారంతో విజయనగరం క్రైమ్ పార్టీ బృందాలు సోమవారం నగరమంతా గాలింపు చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, లైవ్ డిటెక్టర్ పరికరాలతో నగరం మొత్తం అణువణువునా గాలించారు. ఉగ్రవాది సిరాజ్ ఘటన పుణ్యమా అని ఎన్‌ఐఏ తనిఖీలతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరంలో అనుమానంగా సంచరించే వ్యక్తులను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా నగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు, రామానాయుడు రోడ్డు , జిడ్డువారి వీధి, ఐస్ ఫ్యాక్టరీ , అంబటిసత్రం, నీళ్ల ట్యాంక్, పాతబస్డాండ్ , రైల్వే స్టేషన్, గూడ్స్‌షెడ్, కంటోన్మెంట్ మెయిన్ బ్రాంచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, వీటీ అగ్రహారం, కేఎల్‌పురం ప్రాంతాల్లో బొమ్మల అమ్మకాల పేరుతో ఛత్తీస్‌గఢ్, ముంబై, భువనేశ్వర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అరాచకాలు సృష్టించనున్నారన్న సమాచారం నిఘా వర్గాలకు అందడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డీఎస్పీ భవ్యారెడ్డి నేతృత్వంలో ఎస్సైలు సురేంద్రనాయుడు, లక్ష్మణరావు, ఇతర సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ప్రత్యేకించి ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్రత్యేక బృందాలతో పాటు డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ కూడా రంగంలోకి దిగింది.