
గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద విధ్వంసం
● కోర్టు తీర్పు ఉందంటూ జేసీబీలతో ఇళ్లు నేలమట్టం
● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలు
లక్కవరపుకోట: కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతూ మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద గల ఇళ్లను మూడు జేసీబీలతో నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించిన సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై నవీన్ పడాల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మల్లివీడు రెవెన్యూ పరిధి గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద గల 30 సెంట్ల భూమికి సంబంధించి రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన పినిశెట్టి కిష్టప్పదొర, గేదెల అప్పన్నదొరల మధ్య 2015 సంవత్సరం నుంచి వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో మూడు కుటుంబాల వారు ఇళ్లు నిర్మించుకోవడంతో పాటు 9 షాపులు నిర్మించుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెల 27న అప్పన్నదొరకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని అప్పన్నదొర తమ్ముడు ప్రముఖ వైద్యుడు గేదెల రాము తెలిపారు. ఈ మేరకు నాలుగు రోజుల కిందట సంబంధిత జడ్జిమెంట్ అంశాన్ని స్థానిక ఎస్సై నవీన్ పడాల్‌కు తెలియజేసి వివాదా స్థలంలో గల కబ్జాలను తొలిగించేందుకు సహకరించాలని రాము కోరారు. దీంతో శాశ్వత జడ్జిమెంట్ వస్తే తప్పనిసరిగా సహకరిస్తానని ఎస్సై బదులిచ్చారు. ఇంతలోనే రాము విశాఖపట్నం, ఎస్.కోట ప్రాంతాలకు చెందిన కిరాయి వ్యక్తులను సుమారు 30 మందిని తీసుకువచ్చి మూడు జేసీబీల సహాయంతో సోమవారం తెల్లవారు జామున ఇళ్లను, షాపులను కూల్చేశారు. విషయం తెలుసుకున్న పినిశెట్టి కిష్టప్పదొర సంఘటనా స్థలానికి వచ్చేసరికి కిరాయి వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. ఇంతలో రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన యువకులు సంఘటనా స్థలానికి రావడంతో కిరాయి వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో యువకులు వారిని వెంబడించి కొంతమందిని పట్టుకుని, జేసీబీలతో సహా పోలీసులకు అప్పగించారు. దీంతో ఇరువర్గాలూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
కూటమి నేతల అండతోనే..
వివాదానికి సంబంధించిన స్థలంలో గడిచిన 40 సంవత్సరాలుగా 9 కుటుంబాల వారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చిందని హడావిడిగా జేసీబీలతో ఇళ్లు, షాపులును కూల్చేశారని బాధితులు వాపోయారు. కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. కూటమి నాయకుల అండతోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు.