
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం: మండలం నుంచి ఒడిశాకు రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ డివివి.సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు తమకున్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్‌ఐ బి.రామారావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి మంగళవారం ఇరిడి సమీపంలో వేచి ఉండగా రెండు పికప్‌లతో వస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఓ పికప్ వద్ద 50 బస్తాలు, మరో పికప్ వద్ద 40 బస్తాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, రెండు వాహనాలతో పాటు, పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి, బియ్యం తరలించిన వారిపై రెవెన్యూ అధికారులచే 6 ఏ కేసును నమోదు చేయించినట్టు సీఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరి వెంట సీఎస్‌డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ బి.శివ తదితరులు ఉన్నారు.