
కూటమి కక్ష!
ఆరోగ్యమిత్రలపై..
విజయనగరం ఫోర్ట్: ఎన్‌టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పని చేస్తున్న ఆరోగ్యమిత్రల పట్ల కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వారికి రెండు నెలలుగా జీతాలు నిలిపివేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు అందకపోవడంతో ఆరోగ్యమిత్రలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ జీతాల గురించి అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల గురించి ఆరోగ్యశ్రీ అధికారులను అడిగితే అప్కాస్‌లో సమస్య అని, అప్కాస్ వారిని అడిగితే ట్రస్టులో సమస్య అని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు.
జిల్లాలో 94 మంది ఆరోగ్యమిత్రలు
జిల్లాలో 34 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో 94 మంది ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారు. వీరిలో 72 మంది ఆరోగ్య మిత్రాలకు గత రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వీరికి అందలేదు. సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యమిత్రలు కోర్టును ఆశ్రయించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ ఆరోగ్య మిత్రలకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలకే జీతాలు నిలిచిపోవడం గమనర్హాం. ఎన్‌టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ )పరిధిలో ఉన్న వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత వైద్యుని దగ్గరకు వీరు పంపిస్తారు. ఆస్పత్రిలో చికిత్స కోసంగాని, శస్త్రచికిత్స కోసం చేరినట్టయితే వారికి సకాలంలో చికిత్స, శస్త్రచికిత్స జరిగేటట్టు చూడడం ఆరోగ్యమిత్రల యొక్క విధులు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా.. లేదా.. అని పర్యవేక్షించడం, ఏదైనా ఆస్పత్రి సిబ్బంది సేవలు అందించడం కోసం చేతి వాటం ప్రదర్శించినట్టయితే వారి ఫిర్యాదును కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి యొక్క విధి.
జీతాలందక అవస్థలు
జీతాలు అందకపోవడం వల్ల ఆరోగ్యమిత్రలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ, స్కూలు ఫీజులు వంటివి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. తమతో పని చేయించుకుంటున్న అధికారులు జీతాల గురించి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు..
జిల్లాలో 72 మంది ఆరోగ్యమిత్రలకు జీతాలు రెండు నెలలుగా రాలేదు. దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులను అడిగితే అప్కాస్‌లో సమస్య అని, అప్కాస్ అధికారులను అడిగితే ట్రస్ట్‌లో సమస్య ఉందని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. కోర్టును ఆశ్రయించామని జీతాలు నిలిపివేసారో, మరో ఏ కారణం తెలియడం లేదు. జీతాలు రాక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం.
– జెర్రి పోతుల ప్రదీప్,
ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు
వాస్తవమే..
ఆరోగ్యమిత్రలకు జీతాలు రాని మాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
– డాక్టర్ కుప్పిలి సాయిరాం. ఆరోగ్యశ్రీ
జిల్లా కో ఆర్డినేటర్
సమాన పనికి సమాన వేతనం కావాలని కోర్టును ఆశ్రయించిన ఆరోగ్యమిత్రలు
దీంతో 72 మందికి జీతాలు ‘
నిలిపివేసారనే ఆరోపణలు
రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి
అవస్థలు పడుతున్న ఆరోగ్యమిత్రలు
రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన మిత్రలకే ఎక్కువ మందికి జీతాలు అందని పరిస్థితి

కూటమి కక్ష!