తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం

Oct 8 2025 6:59 AM | Updated on Oct 8 2025 6:59 AM

తప్పి

తప్పిన ప్రమాదం

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దేరువాడ గ్రామ సమీపంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం బీరుపాడు గ్రామం నుంచి ప్రయాణికులతో వయా కురుపాం పార్వతీపురానికి బయల్దేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మార్గమధ్యలోని దేరువాడ సమీపానికి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి దారి మళ్లించే క్రమంలో రోడ్డు పక్కకు దిగడంతో టైర్లు మట్టిలో దిగబడిపోయాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహారించి బస్సును నిలుపుదల చేయడంతో పక్కకు బోల్తా పడకుండా ఆగింది. దీంతో ఆ బస్సులో ఉన్న సుమారు 118 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతగిరి సమీపంలో ఏనుగులు

భామిని: మండలంలో ఏబీ రోడ్డు పక్కనే గల అనంతగిరి సమీపంలో ఏనుగులు మంగళవారం కనిపించాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న మొక్కజొన్న పంట చేలలో నాలుగు ఏనుగులు తిరుగాడుతూ పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏబీ రోడ్డుపైకి ఏ క్షణం అయినా రావచ్చని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

ముమ్మరంగా పారిశుధ్య పనులు : కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో గత రెండు రోజులుగా చేపట్టిన పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతూ మార్పుతో కూడిన ప్రగతి సంతరించుకున్నట్టు కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్‌ కాలువల శుభ్రత వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లకు నోడల్‌ అధికారులుగా నియమిస్తూ ఆ మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్‌ చేయడంతో పాటు మురుగునీటి కాలువలు శుభ్రపరచడం, బ్లీచింగ్‌ చల్లడం, పూడికలు తీసి స్ప్రేయింగ్‌ చేయడం గత రెండు రోజులుగా 15 మండలాల్లోని 1125 మంచినీటి ట్యాంకులను శుభ్రపరచి 2,388 మురునీటి కాలువలను శుభ్రపరచినట్టు తెలిపారు. 1398 ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లి స్ప్రేయింగ్‌ చేసినట్టు కలెక్టర్‌ వివరించారు.

గంజాయి స్వాధీనం

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి ఐదు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నట్టు ఎస్‌ఐ వెంకటసురేష్‌ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గుప్తేశ్వరంలో కొనుగోలు చేసి, కాశికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

రైతు సేవా కేంద్రంలో చోరీ

కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం రైతు సేవా కేంద్రానికి చెందిన ఉద్యోగులు విధి నిర్వహించేందుకు వెళ్లారు. కేంద్రానికి వేసిన తాళం పగులగొట్టి కంప్యూటర్‌తో పాటు సంబంధిత పరికరాలను సైతం సోమవారం రాత్రి చోరీ చేసినట్టు ఉద్యోగులు గుర్తించారు. వెంటనే రైతుసేవా సిబ్బంది కురుపాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడుల కేసులో విచారణ వేగవంతం

గుర్ల: మండలంలోని జమ్ములో జరిగిన దాడుల కేసులో విచారణ వేగవంతం చేస్తున్నట్టు సీఐ జి.శంకరరావు తెలిపారు. జమ్ములో ఫోరెనిక్స్‌ బృందం మంగళవారం ఆధారాలు సేకరించింది. దాడులలో నమోదు అయిన రెండు కేసుల్లో ఇప్పటికే 20 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు చెప్పారు.

ఓడ్రుబంగి వాసి ఒడిశాలో మృతి

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఓడ్రుబంగి గ్రామానికి చెందిన పి.పారయ్య(45) ఒడిశాలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులతో కలిసి ఒడిశాలోని శిఖల ప్రాంతంలో వెటకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు వారి వెంట తీసుకెళ్లిన నాటుతుపాకీ తూటా తగిలి మృతి చెందాడని.. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ఆ మృతదేహాన్ని మంగళవారం ఓడ్రుబంగి గ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఒడిశాలో మృతి చెందడం వలన ఒడిశాకు చెందిన రామన్నగూడ పోలీసులకు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని మరలా స్వాధీన పర్చుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తప్పిన ప్రమాదం 1
1/1

తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement