
కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు చైర్‌పర్సన్ ఫిర్యాదు
● కౌన్సిల్ తీర్మానాన్ని లెక్క చేయడం లేదు..
● తగు చర్యలు తీసుకోవాలని వినతి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పార్వతీపురం మున్సిపల్ పరిధిలో నిరాశ్రయుల వసతిగృహం నిర్వహణ బాధ్యతల అప్పగింతపై నెలకొన్న సమస్యపై మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష వైఖరితో కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరీ మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని నిరాశ్రయుల వసతిగృహ నిర్వహణ కోసం స్థానికత ఉన్న ఆదర్స్ రూరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు బాధ్యతలు అప్పగించాలని 30 సెప్టెంబర్ 2024న కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం నంబరు 633 ద్వారా నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ ఏడాది 31 జూలైన మరోసారి పాత తీర్మానాన్ని బలపరుస్తూ తీర్మానం నంబరు 765ను ఆమోదించినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని మినిట్ బుక్‌లో కూడా స్పష్టంగా నమోదు చేశామన్నారు. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ తీర్మానం మినిట్ బుక్‌లో నమోదయ్యాక దానిని అమలు చేయాల్సిన బాద్యత కమిషనర్‌పై ఉంటుందని వివరించారు. కానీ నెలలు గడుస్తున్నా కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఆయనే తేలుస్తారంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై న పాలకవర్గాన్ని, కౌన్సిల్ అధ్యక్షురాలైన తనను ఈ విధంగా వ్యవహరిస్తూ అవమానించడమేనని ఆమె స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. కలెక్టర్ ఈ విషయంలో స్పందించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అర్హత పొందిన సంస్థకు తక్షణమే నిరాశ్రయుల వసతిగృహం బాధ్యతలు అప్పగించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరినట్టు చైర్‌పర్సన్ తెలిపారు. కమిషనర్ వైఖరితో నిరాశ్రయులకు అందాల్సిన సేవల్లో జాప్యం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.