
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మరణాలు
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ధ్వజం
పార్వతీపురం రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనిపై మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మంగళవారం తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద చనిపోయారంటూ ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమన్నారు. ప్రభుత్వం సరైన వసతులు కల్పించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. గిరిజన విద్యార్థుల బాగోగులను ప్రభుత్వం సరిగా పర్యవేక్షించి ఉంటే 120 మందికి పచ్చకామెర్లు ఎలా వచ్చాయి? పది నెలల్లో 11 మంది ఎలా చనిపోయారు? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కలుషిత నీరు, అపరిశుభ్రతే ఈ అనర్థాలకు మూలమని, ఏళ్ల తరబడి ఏఎన్‌ఎంలను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్‌లో వెంటనే ఏఎన్‌ఎంను నియమించి, సురక్షిత నీరు, పౌష్టికాహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.