
నాగావళిలో దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పైనుంచి నాగావళి నదిలో దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వీరఘట్టం మండలం బిటివాడ గ్రామానికి చెందిన కళ్లేపల్లి జగదీష్ (33) వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన పార్వతిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపల వ్యాపారం రీత్యా గరుగుబిల్లి మండలం రావివలసలో స్థిరపడ్డారు. చేపల వ్యాపారం ముగించుకుని మగ్గూరు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న రుషింగి వంతెన సమీపం వచ్చే సరికి వ్యాపార నిమిత్తం భార్యాభర్తలు ఇరువురు తగాదా పడ్డారు. ఈ క్రమంలో వంతెన వద్దే బండిని నిలిపివేసి భార్య ముంగిటే నదిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు చేరుకుని గాలించినా ప్రయత్నం లేకపోయింది. భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నదిలో గల్లంతైన జగదీష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని హెచ్‌సీ దూసి రాములు తెలిపారు.

నాగావళిలో దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం