
రాత్రి వేళ కానరాని ఆర్టీసీ పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మంగళవారం రాత్రి వేళ కనిపించలేదు. వర్షం కారణంగా సిరిమానోత్సవం షెడ్యూల్ రెండు గంటల పాటు జాప్యం జరిగిన నేపథ్యంలో భక్తుల తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అయితే ఆర్టీసీ ప్రత్యేక సేవలను సాయంత్రం 7 గంటలకే ఆపేయడం వల్ల జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు ఇళ్లకు చేరడానికి ఇబ్బంది పడ్డారు. నిజానికి ప్రత్యేక సర్వీసుల షెడ్యూల్ ప్రకారం పండగ రెండవ రోజు మంగళవారం 80 బస్సులను ఏర్పాటు చేయాలి. సిరిమానోత్సవం జరిగేది సాయంత్రం 3 గంటలకు కాబట్టి ఆ తర్వాత ఎక్కువ సర్వీసులు వేయాలి, కానీ వేయకపోడం వల్ల జిల్లా కేంద్రం నుంచి విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల రూట్లలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.