
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలన్నారు. ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712686057కు ఫోన్ చేసి పోలీసు సేవలు పొందాలన్నారు.
ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతులు చేయిస్తాం
మఠంపల్లి: మంచ్యాతండా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లకు మరమ్మతులు చేయిస్తామని నీటిపారుదల ఈఈ అశోక్ చెప్పారు. మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా వద్ద గల ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మూడు మోటార్లకు గాను పనిచేయని రెండిటికి మరమ్మతులు చేయించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈఈ వెంట డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్, లిఫ్టు చైర్మన్ కోట్యానాయక్, వైస్ చైర్మన్ చంద్రునాయక్, మాళోతు బాబునాయక్, రాజా నాయక్, ఆపరేటర్ నాగేశ్వరరావు ఉన్నారు.
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు
నాగారం : బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన ఎర్ర రాంబాబును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్‌రామ్ శేఖర్ సోమవారం నియమించారు. ఈ సందర్భంగా ఎర్ర రాంబాబు మాట్లాడుతూ బీఎస్పీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన బీఎస్పీ రాష్ట్ర కోఆర్టినేటర్లు బాలయ్య, దయానంద్, రామచంద్రం, పార్టీ నాయకులకు రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌కు 9,152 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 7,994 క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 643.50 వద్ద నిలకడగా ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మూసీ కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.06 టీఎంసీల నీరు న్విల ఉందని అధికారులు తెలిపారు.

బాధితులకు భరోసా కల్పించాలి

బాధితులకు భరోసా కల్పించాలి