
కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్ల కనీస వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కామళ్ల నవీన్, గంటా నాగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్లకు (కేజీబీవీ, మిషన్ భగీరథ, అంగన్‌వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్, గ్రామ పంచాయతీ) అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సామ నర్సిరెడ్డి, సీహెచ్.అంజయ్య, యాదగిరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.