
1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను సోమవారం పెంచారు. వారబందీ విధానంలో గత వారం 1,429 క్యూసెక్కుల నీటిని వదలగా ప్రస్తుతం 1,613 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69, 70, 71 డీబీఎంలకు పంపిణీ చేస్తున్నారు. గతనెల 8వ తేదీ నుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి వారబందీ విధానంలో జిల్లాకు నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట : తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేట పట్టణంలో సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడుగుంట్ల విద్యాసాగర్, కార్యదర్శిగా గజ్జల కృష్ణారెడ్డి, కోశాధికారిగా బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా స్వామి బుచ్చయ్య, కొక్కుల మోహన్‌రావు, దండా వెంకట్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంపటి పురుషోత్తం, మద్ది ఉపేందర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఈదుల శంకరయ్య, తంగెళ్ల రంగారెడ్డి, దాచేపల్లి సుజాత, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా నాగిరెడ్డి విజయమ్మ, ఉప్పల గోపాలకృష్ణయ్య, గుండా వెంకన్న, మొరిశెట్టి యోగి, కాసర్ల సురేందర్‌రెడ్డి, తాళ్లపల్లి రామయ్య, ఆకారపు ఉపేందర్, గజ్జల ధర్మారెడ్డి, పసుపర్తి కృష్ణమూర్తి, గుండా భిక్షపతి, కొండ్లె రంగయ్య ఎన్నికయ్యారు. నూతన కార్యకర్గంతో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా సలహాదారులు కర్నాటి కిషన్ దాండ్గే సుభాష్, ఆరె రామకష్ణారెడ్డి, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
56 సర్పంచ్ స్థానాల్లో పోటీ
సూర్యాపేట అర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 9 జెడ్పీటీసీ, 56 సర్పంచ్, 59 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో ఉంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి బలమున్న చోట్లలో సొంతంగా పోటీ చేసి మతోన్మాద బీజేపీని ఓడిస్తామన్నారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.
మూసీకి పెరిగిన వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం 2,248 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 8,761 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 7,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 533 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644.15 అడుగుల(గరిష్ట నీటిమట్టం 645 అడుగుల) వద్ద స్థిరంగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.

1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు

1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు

1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు