
పర్యావరణ హితానికి ఎకో క్లబ్‌లు
నాగారం : మొక్కలే సకల జీవులకు జీవనాధారం.. మొక్కలు నాటి సంరక్షిస్తేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటే జీవుల మనుగడ సాఫీగా సాగుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించి వారిచేత మొక్కలు నాటించాలని విద్యాశాఖ భావించి పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి విద్యాశాఖ అధికారులు సర్కారు బడుల్లో ఒక్కో తరగతి నుంచి నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపికచేసి పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ క్లబ్‌లు (ఎకో క్లబ్‌లు) ఏర్పాటు చేశారు. ఇందులో అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ఈ క్లబ్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచే ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్‌గా పేరు మార్చారు. వీటిద్వారా పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు. ఎకో క్లబ్‌ల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తూ భావితరాలకు పాఠం నేర్పనున్నారు.
ప్రధాన లక్ష్యం ఇదీ..
ఈ క్లబ్‌ల ద్వారా జీవ వైవిధ్యం, పర్యావరణం–వనరుల పునర్వినియోగం, మొక్కలు పెంచి వనాలు సృష్టించడం, పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం వంటి అంశాలపై కార్యక్రమాలు చేపట్టడం ప్రధాన లక్ష్యం. అందుకు సంబంధించిన కార్యాచరణ ఫొటోలు, వీడియోలు వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, పాఠశాలల యాజ మాన్య కమిటీ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు.
అమ్మ పేరుతో మొక్క..
ప్రతి పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ప్లాస్టిక్ నిషేధం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం, వ్యర్థాలు, ఈ–వ్యర్థాలు తగ్గించేలా విద్యార్థులను, ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతున్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో ప్రతి విద్యార్థి వారి తల్లులతో కలిసి మొక్కలు నాటడం. లేదా అమ్మ పేరుతో మొక్క నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఆయా తేదీల్లో వచ్చే పర్యావరణ, ధరిత్రి, జల, ఓజోన్ దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారిని పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దడంలో ఎకో క్లబ్‌లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి.
950 ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు
సభ్యులుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు
ఈ ఏడాది ఎకో క్లబ్ ఫర్
మిషన్ లైఫ్‌గా పేరు మార్పు
పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు