
లింగ నిర్ధారణ చేస్తున్న నలుగురు అరెస్ట్
సూర్యాపేటటౌన్ : గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అబార్షన్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ నేరంటి ప్రవీణ్, నకిరేకల్‌కు చెందిన ల్యాబ్ టెక్నిషన్‌లు అమరావది కరుణాకర్, షేక్ వసీమ్, సీతారాంపురానికి చెందిన ఆర్‌ఎంపీ మనుబోలు రాంబాబు ఎలాంటి అర్హతలు లేకున్నా ఆర్‌ఎంపీ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. తమ దగ్గరకు వచ్చే గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.వేలకు వేలు దండుకుంటున్నారు. పరీక్షకు రూ.12వేలు కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు అయితే పిండాన్ని తొలగించేందుకు రూ.50వేలు తీసుకొని టాబ్లెట్ల ద్వారా గర్భస్రావం చేస్తున్నారు. నలుగురు కలిసి ఆల్ట్రాసౌండ్ మెషిన్ కొనుగోలు చేసి సీతారాంపురంలోని నేరంటి ప్రవీణ్ ఇంటి వద్దే పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. రాజీవ్‌నగర్ యూపీహెచ్‌సీ డాక్టర్ హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురి వ్యక్తులను పట్టుకుని వారి నుంచి ఒక ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
ఎలాంటి అర్హతలు లేకున్నా
ఆర్‌ఎంపీలుగా చలామణి
సీతారాంపురంలో పరీక్షలు
చేస్తుండగా పట్టుకున్న పోలీసులు