
ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కబడ్డీ క్రీడాకారులను గుర్తించి
ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు
కోదాడ: ప్రతిభ గల కబడ్డీ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని, దానికి నిదర్శనమే ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తృతీయస్థానం సాధించడమేనని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జట్టు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎండీ మహబూబ్‌జాని మాట్లాడుతూ.. కోదాడను కబడ్డీ క్రీడకు కేరాఫ్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈదుల కృష్ణయ్య, జానకిరాంరెడ్డి, పంది కళ్యాణ్, జూలూరు వీరభద్రం, సైదులు, చలిగంటి రామారావుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ కు పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం జరిపించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
మూసీ ప్రాజెక్టుకు
2,248 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గింది. మూసీ రిజర్వాయర్‌కు పదిహేను రోజుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పైగా వచ్చిన ఇన్‌ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తిన అధికారులు 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రం వరకు 643.80 అడుగుల(4.15 టీఎంసీలు)వద్ద నీరుంది.

ప్రజావాణి రద్దు