చిలుకూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి 12 రాజకీయ పార్టీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచే ఆయా అభ్యర్థులకు పార్టీలు బీ ఫారాలు అందజేస్తాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీలకు స్థానిక ఓటర్ల జాబితా ముద్రించి అందించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్ జాబితాను ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం, ఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ఆద్మీ, జనసేన పార్టీలను మాత్రమే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందిస్తే వారికి పార్టీల గుర్తులు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే వారికి ఇతర గుర్తులు కేటాయించనున్నారు.
ఫ స్థానిక సంస్థల ఎలక్షన్లకు
సంబంధించి ఎన్నికల సంఘం
నుంచి గుర్తింపు
ఫ ఆయా పార్టీలకు ఓటర్ల జాబితా
అందించేందుకు ఏర్పాట్లు
ఫ బీ ఫారాలు పొందిన అభ్యర్థులు
పార్టీల గుర్తుతో బరిలోకి
ఫ స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులు కేటాయింపు
ఎంపీటీసీ స్థానాలు : 235
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు : 23
పోలింగ్ కేంద్రాలు : 1272
మొత్తం ఓట్లు : 6,94,815
ముమ్మరంగా ఎన్నికల ప్రక్రియ
జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1272 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిల్లో మొత్తం 6,94,815 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, వారి విగ్రహాలకు ముసుగులు వేశారు. కాగా.. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించే తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు.