
పోటీకి ఎవరు మేటి?
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. షెడ్యూల్ వెలువడిందో.. లేదో ఆయా స్థానాల్లో ఎవరూ పోటీ చేస్తే బాగుంటుందనే విషయమై ముఖ్య నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎవరెవరు పోటీలో ఉంటారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్న వారెవరో ఆయా పార్టీల మండల అధ్యక్షులు వివరాలు సేకరించి జిల్లా ముఖ్యనేతలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పార్టీల ముఖ్య నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సహా ఎన్నికల్లో ఎలా ఓటర్ల వద్దకు వెళ్లాలనే విషయమై రహస్య సమావేశాలు నిర్వహించడమేగాక పలు సూచనలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను వీలైనంత త్వరగా ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పడ్డాయి. నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి సంబంధించి ఆశావహులతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నారు.
గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా..
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రతి జెడ్పీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మండలానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలని అధిష్టానం జిల్లా ముఖ్యనేతలను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేస్తే జెడ్పీ పీఠం సులువుగా దక్కుతుందన్న అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో లబ్ధి పొందాలని చూస్తోంది. యూరియా సరఫరా, ఎస్సారెస్పీ నీటిని జిల్లాకు అందించే విషయాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేలా ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా బీజేపీ చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది.
జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు ఉండగా.. బీసీల రిజర్వేషన్ శాతం పెరిగింది. ఈ క్రమంలో బీసీలకు గణనీయంగా స్థానాలు పెరిగి.. జనరల్ స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. తదనంతరం సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆయా స్థానాల కోసం కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు.
ఫ అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీల తీవ్ర కసరత్తు
ఫ జెడ్పీటీసీ స్థానాలపై కన్ను
ఫ ముగ్గురు ఆశావహులతో జాబితా తయారు చేస్తున్న కాంగ్రెస్
ఫ పార్టీ మండలాల అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న
బీఆర్‌ఎస్, బీజేపీ